⍟ ఏప్రిల్ చివరినాటికి భారత్‌లో కరోనా వైరస్ కేసులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఇండియన్ చెస్ట్ సొసైటీ వ్యాఖ్యానించింది. మనకి మరో నెల సమయం ఉందని, ఏప్రిల్ చివరి లేదా మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని, అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చని ఇండియన్ చెస్ట్ సొసైటీ చీఫ్ క్రిస్టోఫర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ చర్యలతో తప్పకుండా కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
⍟ కరోనా వైరస్ కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాదు, వారి జీవన ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ద్రవనిధి సంస్థ (ఐఎంఎఫ్) అధినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల ఉత్పన్నమైన సంక్షోభం మానవాళికి చీకటి రోజులుగా అభివర్ణించారు. పూర్తి కథనం.
⍟ కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని పటిష్ట చర్యలు చేపట్టినా దాని ఉద్ధృతి మాత్రం ఆగడంలేదు. వైరస్ బాధితులకు చికిత్స అందజేసే వైద్య సిబ్బందికి కూడా కోవిడ్ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఇద్దరు కొవిడ్ 19 బాధితులకు వైద్యం అందించిన 108 మంది ఆసుపత్రి సిబ్బంది ఇప్పుడు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
⍟ కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా దేశవ్యాప్తంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించే అంశంపై రైల్వే శాఖ తాజాగా స్పందించింది. ఈ విషయంపై ఏప్రిల్ 12 తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రస్తుతం సరకు రవాణా రైళ్లు తప్ప మిగతావన్నీ రద్దయినట్టు స్పష్టంచేసింది.
⍟ దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో ప్రజలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇంట్లో తయారు చేసిన ఫేస్ కవర్లను వాడాలని ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ధరించాలని సూచించింది. మహారాష్ట్రలో శనివారం మరో 47 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 537కి చేరింది.