కుక్కలు, పిల్లులు తినడం నిషేధించిన మొదటి చైనా నగరం... ఇప్పటికైనా మారుతున్నారా.

చైనాలో కుక్క, పిల్లి మాంసం అమ్మకాలు మరియు వినియోగాన్ని నిషేధించిన మొట్ట మొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ మాంసం మార్కెట్ నుండి బయటకు వచ్చిందనే వార్తల నేపధ్యంలో ఈ చర్య అమలులోకి వచ్చింది. దీంతో అడవి జంతువుల వ్యాపారం మరియు వినియోగంపై నిషేధం విధించాలని చైనా అధికారులు నిర్ణయించారు.



ఇతర వన్య ప్రాణులతో పాటు కుక్క, పిల్లి మాంసం అమ్మకం, వినియోగంను పూర్తిగా నిషేధించేందుకు చైనాలోని షెన్జెన్ నగరం మొదటి అడుగు వేసి ముందుకు వచ్చింది. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (హెచ్ఎస్ఐ) నివేదికల ప్రకారం... ఆసియా మొత్తం మీద ప్రతి ఏటా వినియోగం కోసం దాదాపు 30 మిలియన్ కుక్కలను చంపుతున్నారు. కుక్క మాంసం తినడం చైనాలో సర్వ సాధారణం కాదు. అతి తక్కువ మంది మాత్రమే ఈ మాంసాన్ని ఆహారంలో వినియోగిస్తుంటారు. ప్రజలు ఇంకా దీనికి పూర్తిగా అలవాటు పడలేదు కాబట్టి కుక్క మాంసాన్ని నిషేధించడం చాలా సులభం.




షెన్జెన్ ప్రభుత్వం ప్రకారం... కుక్కలు మరియు పిల్లులు ఇతర జంతువులతో పోలిస్తే పెంపుడు జంతువులుగా మానవులతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన తైవాన్, హాంకాంగ్ లలో కుక్కలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువులను తినడంపై నిషేధం ఉంది. దీని దృష్టిలో పెట్టుకుని షెన్జెన్ లో కూడా ఈ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మే 1వ తేదీ నుండి ఈ నిషేధం అమలులోకి రానుంది.




షెన్జెన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జంతు న్యాయవాద సంస్థ హెచ్ఎస్ఐ స్వాగతించింది. ప్రతి సంవత్సరం చైనాలో 10 మిలియన్ కుక్కలు, 4 మిలియన్ పి‌ల్లులను చంపే ఈ క్రూరమైన వాణిజ్యాన్ని అంతం చేసే ప్రయత్నాల్లో ఇది నిజంగా ఒక గొప్ప పరిణామమని పేర్కొంది. కొత్త నియమం ఉన్నప్పటికీ కరోనావైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేయడానికి ఎలుగుబంటి పైత్య రసమును ఉపయోగించడానికి చైనా ఆమోదం తెలిపింది. ఇది ఎలుగుబంట్లలో ఉండే జీర్ణ రసం. బ్రతికి ఉన్న ఎలుగుబంట్ల నుండి ఒక బాధాకరమైన ప్రక్రియ ద్వారా దీనిని సేకరిస్తారు. ఇవి బందిఖానాలో పెంపకం చేయబడతాయి. సాంప్రదాయకంగా తయారు చేసిన అనేక చైనీస్ మందులలో ఈ ద్రవం ఉపయోగించబడుతుంది. కానీ ఇది కరోనా వైరస్ రోగులకు పని చేస్తున్నట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.